Tusshar Kapoor | మరో బాలీవుడ్‌ నటుడికి బెదిరింపు కాల్‌.. రూ.5 కోట్ల డిమాండ్‌!

ముంబై, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: ప్రముఖ నటుడు తుషార్‌ కపూర్‌కు బెదిరింపు కాల్‌ రావడం బాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కుఖ్యాత గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు చెప్పి, ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్‌ చేయడం నటుడిని షాక్‌కు గురిచేసింది.

పోలీసులు, మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. కొద్ది రోజుల క్రితం తుషార్‌ కపూర్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి తనని తాను ‘హ్యారీ బాక్సర్‌’ అని పరిచయం చేసుకుంటూ.. తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సభ్యుడినని బెదిరించాడు. వెంటనే రూ. 5 కోట్లు చెల్లించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

ఈ ఊహించని పరిణామానికి అప్రమత్తమైన తుషార్‌ కపూర్‌ వెంటనే ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌, యాంటీ ఎక్స్‌టార్షన్‌ సెల్‌ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.

తనను హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి గొంతు.. అసలైన హ్యారీ బాక్సర్‌ వాయిస్‌ శాంపిల్స్‌తో సరిపోలలేదని ప్రాథమిక విచారణలో తేలింది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేసేందుకు ఎవరో ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తుషార్‌ కపూర్‌ ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. కాల్‌ మూలాలు, నిందితుల గుర్తింపుపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది.