విద్యార్థులు కంప్యూటర్‌ విద్యను అందిపుచ్చుకోవాలి

చిన్ననాటి నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి:
సర్పంచ్‌ వాకిటి వెంకటేష్‌

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పెద్దజట్రం సర్పంచ్‌ వాకిటి వెంకటేష్‌ అన్నారు. విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య ఎంతో అవసరమని, చిన్ననాటి నుంచే కంప్యూటర్‌పై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.

బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల పరిధిలోని పెద్దజట్రం ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్‌ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కంప్యూటర్‌పై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్‌ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి అవసరమని పేర్కొన్నారు. పాఠశాలకు నాలుగు కంప్యూటర్లు మంజూరయ్యాయని, ప్రతి విద్యార్థి కంప్యూటర్‌ విద్యలో ప్రావీణ్యం సాధించేలా శిక్షణ పొందాలని వాకిటి వెంకటేష్‌ సూచించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం గౌరమ్మ, హెచ్‌ఎం తమ్మప్ప, మాజీ ఎంపీటీసీ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.