టీటీడీ డిప్యూటీ ఈవో ఇంటిపై ఏసీబీ దాడులు
తిరుపతితో పాటు పలుచోట్ల ఏకకాలంలో సోదాలు
అవినీతి ఆరోపణల నేపథ్యంలో నిఘా అనంతరం చర్యలు
తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ మెండు లోకనాథం నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ సోదాలు చేపట్టారు. లోకనాథం నివాసంతో పాటు ఆయన తమ్ముడు, ఇతర బంధువులకు సంబంధించిన ఇళ్లతో కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. లోకనాథంపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ అధికారులు కొంతకాలంగా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన అనంతరం బుధవారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.
భారీగా బంగారం.. కీలక పత్రాల స్వాధీనం
సోదాల్లో బంగారు, వెండి బిందెలతో పాటు బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు, పత్రాలను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వాటి విలువ, లోకనాథం ప్రకటించిన ఆస్తులు, ఆయన ఆదాయ వనరులతో వాటికి ఉన్న సంబంధంపై విచారణ కొనసాగుతోంది. జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన లోకనాథం ప్రస్తుతం టీటీడీ డిప్యూటీ ఈఓ స్థాయికి చేరుకున్నారు. ఆయన ఉద్యోగ ప్రస్థానంలో సంపాదించిన ఆస్తులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఆదాయ వనరులు తదితర అంశాలపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లతో సోదాలంటూ ప్రచారం.. ఖండించిన ఏసీబీ
లోకనాథం నివాసాలపై జరుగుతున్న సోదాలు రాజకీయ పార్టీ నేతల ఒత్తిళ్ల కారణంగానే జరుగుతున్నాయంటూ కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఖండించారు. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల ఆధారంగానే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు తీసుకుని చట్ట ప్రకారం సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోదాలు పూర్తయ్యే వరకు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం లేదని, స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. అదే సమయంలో ఏసీబీ అధికారులమంటూ ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాంటి వ్యక్తుల సమాచారం కూడా 1064కు తెలియజేయాలని సూచించారు.

