జహీరాబాద్ – తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ అన్నారు. కేసీఆర్ కు బైబై చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. జహీరాబాద్ లో ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. బీఆర్ఎస్ అత్యంత ధనిక పార్టీ అని… అంత డబ్బు ఆ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడి సంపాదించుకున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారని..అంతా అవినీతి ప్రభుత్వమేనని,. ఇలాంటి సీఎం మనకు అవరసమా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని… కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. ధరణి పోర్టల్ తో భూములను లాగేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అదానీ, అంబానీలకు బీజేపీ కొమ్ముకాస్తోందని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయానని ప్రియాంక అన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లను కూడా లీక్ చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.