Thursday, November 21, 2024

షర్మిల పార్టీ జెండా సిద్ధం.. నిరాడంబరంగానే పార్టీ ఆవిర్భావం!

తెలంగాణలో రాజన్నరాజ్యమే లక్ష్యంగా కొత్తపార్టీ స్థాపించబోతున్న వైఎస్ షర్మిల.. ఇందుకు సంబంధించిన కార్యచరణను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8న పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పార్టీ గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేశారు. పార్టీ జెండా, ఎజెండా, విధివిధానాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పాలపిట్ట, నీలిరంగుల్లో షర్మిల పార్టీ జెండాను రూపొందిస్తున్నారు. యువశక్తి, రైతురాజ్యం పార్టీగా షర్మిల ప్రకటించనున్నారు.

ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించిన సభ ద్వారా తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేశారు షర్మిల. ఆ సభ విజయవంతం కావడంతో పార్టీ ప్రకటన కూడా అంతే స్థాయిలో వైభవంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, కోవిడ్ నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే పార్టీ పేరు,జెండా, ఎజెండాను ప్రకటించాలని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. దీంతో షర్మిల మద్దతుదారులు, వైఎస్సార్ అభిమానులు ఒకింత డీలా పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8న వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ కార్యక్రమాన్ని వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఫిల్మ్‌ నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ సభ జరగనుంది. వెయ్యి మంది పార్టీ ముఖ్యులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాలలో వర్చువల్‌గా లక్ష మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై మాటల దాడిని కూడా షర్మిల కొనసాగుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటనలు కూడా చేశారు. నిరుద్యోగం, రైతు సమస్యలపై గళం విప్పారు. అంతేకాదు, ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తన సోదరుడు జగన్ అధికారంలో ఉన్నా సరే… తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధమని ప్రకటించారు. తెలంగాణకు చెందిన ఒక్క చుక్క నీటిని కూడా వదలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణపై తన స్టాండ్ గట్టిగా ఉందనే సంకేతాన్ని ఇచ్చారు. పార్టీ ప్రకటన అనంతరం షర్మిల తెలంగాణతోపాటు ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: కడియంపై కేసీఆర్ లెక్క ఇదేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement