టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ‘దొంగతనం అన్న అనుమానంతో అరెస్టు చేసిన మహిళను లాకప్ డెత్ చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. నిజనిజాలు నిగ్గుతేల్చకుండా చంపమని చెప్పిందా ఈ సర్కార్..? పోలీస్ స్టేషన్‌లో చంపేసి గుండెపోటు అంటూ నాటకాన్ని రక్తికటిస్తారా..? ఇదేనా మీరు చేసే విచారణ’ అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ నెపంతో అన్యాయంగా ఒక మహిళ ప్రాణాలు తీస్తారా ? అని మండిపడ్డారు. మరియమ్మను పొట్టనపెట్టుకున్న అడ్డగూడూరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని షర్మిల విమర్శించారు.
కాగా, చోరీ కేసులో యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల అదుపులో ఉన్న అంబడిపూడి మరియమ్మ (50) అనే మహిళ మృతి చెందడం సంచలన రేపిన సంగతి తెలిసిందే. పోలీసు దెబ్బలు తట్టుకోలేక మరియమ్మ అనే మహిళ మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ అని మరియమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.