తెలంగాణలో కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. రెమిడేసివిర్ కోసం జనం చాంతాడంత క్యూలు కడుతున్నారని.. అయినా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోమారు విమర్శలు చేశారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న సారు కేటీఆర్‌కు కరోనా కష్టాలు అసలే కనపడవు అంటూ విమర్శించారు.
రూ.3500 విలువ చేసే ఒక్క రెమిడెసివర్ ఇంజక్షన్ ను చాలా మంది బ్లాక్ లల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. వాటిని రూ.40 వేలకు కూడా కొంటున్నామని బాధితులు చెబుతున్నా వినిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఇవి ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఆక్సిజన్ లేక కరోనా రోగులు చస్తుంటే తనకేమీ పట్టనట్లు చేస్తున్నారని ఆరోపించారు. తండ్రీ కొడుకులు తమ గారడి మాటలను పక్కన పెట్టి, బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడివిసిర్లు కొరత ఉందని ఒప్పుకొని, వాటిని ఎలా అందించాలని ఆలోచించండి అని షర్మిల హితవు పలికారు.