Thursday, November 21, 2024

MBNR: యువత మత్తుకు బానిస కావొద్దు… కలెక్టర్ రవి నాయక్

మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో, ప్రభ న్యూస్ : మత్తు పదార్థాల నివారణతో పాటు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని కృషి చేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ, అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలోని సమావేశం మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మారుతున్న జీవన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు సైతం మత్తుపదార్థాలకు బానిసలు అవుతున్నారని, అలాగే విద్యార్థులతో పాటు, సాధారణ సమాజం సైతం మత్తు పదార్థాల బారిన పడటం బాధాకరమన్నారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కల్లు, సారా అదేవిధంగా గుట్కా ఇతర మత్తుకు సంబంధించిన మందులు అన్నింటివల్ల కలిగే క్షణిక సంతోషం గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలను సైతం దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరూ మత్తు పదార్థాల బారిన పడకుండా అందరూ పనిచేసి 100శాతం నివారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతకుముందు ఉదయం జిల్లా పరిషత్తు మైదానం నుండి తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ… జిల్లాలో మత్తుపదార్థాల నివారణకు అదేవిధంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో మత్తుమందుల నివారణలో భాగంగా 14 మందిని గుర్తించడం జరిగిందని, దీనిని పూర్తిగా నిరోధించడంలో అందరి సహాయ సహకారాలు అవసరమని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తుపదార్థాల నివారణకు ఉద్దేశించిన జిల్లా స్థాయి కమిటీలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కమిటీ మత్తుపదార్థాల నివారణ, నిషేధానికై కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి, జెడ్పి సీఈవో జ్యోతి, డీఈఓ రవీందర్, ఎక్సైజ్ సూపరిండెంట్ సైదులు, సిడబ్ల్యుసి చైర్మన్ నాయీమ్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రహమాన్, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డి.ఎస్.పి మహేష్, పోలీస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. ర్యాలీలో జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో పాటు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement