నిజామాబాద్ అర్బన్, ఏప్రిల్ 23 (ప్రభన్యూస్) : నగరంలో చాలా రోజుల తర్వాత కత్తులు స్వైర విహారం చేశాయి. రెండు గ్యాంగ్ లు రాజీ కోసం ఎదురుపడి ప్రత్యర్థి గ్యాంగ్ ఓ గ్యాంగ్ కత్తులతో విరుచకపడడంతో ఒకరు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ మర్డర్ పూర్తి వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. నగరంలోని వినాయక నగర్ కు చెందిన అర్బాజ్ ఖాన్ అలియాస్ అబ్బాస్ ఖాన్ (18), బాబన్ సహాబ్ పహాడ్ కు చెందిన అజర్, అదిల్, రాజ్, పర్వేజ్ లను బాబన్ సాహెబ్ పహాడ్ కు చెందిన సోహెల్ మీర్జా, సర్ఫరాజ్, హుస్సేన్, హాజీ, సమీర్, షౌకత్, చిల్లి లతోపాటు మరో పదిమంది సంధి కోసం పిలిచారు. శనివారం జరిగిన గొడవలో కాంప్రమైజ్ కోసం బాబానుసాహెబ్ పహాడ్ ప్రాంతానికి రాజీ కోసం పిలిచారు.
ఆదివారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లిన అర్బాజ్ ఖాన్ , అజర్ మరో ముగ్గురు పై ప్రత్యర్థి గ్యాంగ్ గొడవకు దిగింది. ఈ సంఘటన డిప్యూటీ మేయర్ వెంచర్ వద్ద ప్రారంభమై సూపర్ మార్కెట్ వరకు తోపులాట ఘర్షణకు దిగారు. సర్ఫరాజ్ తన వద్ద ఉన్న కత్తిని సోహెల్ మీర్జా కు ఇవ్వడంతో అతను కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అర్బాజ్ ఖాన్ కడుపులో కత్తిపోట్లు దిగి తీవ్ర రక్తస్రావమైంది. మరో యువకుడు అజర్ కు చెంపపై కత్తి గాయమైంది. ఇరువురిని జిల్లా ఆస్పత్రికి తరలించగా అర్బాజ్ ఖాన్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాబన్ సాహెబ్ పహాడ్ ప్రాంతంలో పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రధానంగా రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో శాంతిభద్రతలు స్తబ్దంగా ఉండగా రంజాన్ పండుగ సందర్భంగా జరిగిన గొడవ యువకుడి ప్రాణాలను బలి కోరింది. పండగ రోజు కారు నడిపేటప్పుడు ఎదుటి వర్గం కు చెందిన వ్యక్తిపై బురద పడడమే ఈ గొడవకు హత్య కారణమని తెలిసింది. నగరంలో శాంతిభద్రతల కోసం పోలీసులు ఆరవ టౌన్ ఏరియాలో, జిల్లా జనరల్ ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.