Friday, November 22, 2024

నూతన వంగడాల కోసం యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలి.. వినోద్ కుమార్

హైదరాబాద్ : తెలంగాణ వాతావరణ పరిస్థితులకనుగుణమైన నూతన వంగడాల రూప కల్పనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో గురువారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సాగునీటి వసతి పెరగడంతో రాష్ట్రంలో వరి పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, అలాగే పప్పు దినుసులు, నూనగింజల వంటి పంటల సాగు విస్తీర్ణం కూడా పెంచడానికి శాస్త్రవేత్తలు తగిన సూచనలు చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది చాలా చురుకైన క్రియాశీలకమైన పాత్ర వహించారని వినోద్ కుమార్ కొనియాడారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర ఉద్యోగుల ఆకాంక్షలకనుగుణంగా విశ్వవిద్యాలయం పాలన వ్యవహారాలు జరిగే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభించే విధంగా సహకరిస్తానన్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డితోనూ చర్చిస్తానన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యం, రాష్ట్రం ఏర్పాటులో ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లను ఈ సందర్భంగా వినోద్ కుమార్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతి కల్పించడంతోపాటు, విద్యుత్ ఉత్పత్తి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలపై అధికంగా నిధులు వెచ్చించామన్నారు.

ఫలితంగా భూగర్భ జలాల పెంపుతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. నూతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో పాటు, నూతన వంగడాల రూపకల్పనలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రైడ్ ఆఫ్ తెలంగాణాగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ అగ్రికల్చర్ సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. విద్యాసాగర్ మాట్లాడుతూ.. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం పదోన్నతులు, ఏరియర్స్ విడుదల, టైం స్కేల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, పాలకమండలి నియామకం, హెల్త్ కార్డుల పంపిణీ, ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, 2016 పి ఆర్ సి ఏరియర్స్ విడుదల వంటి తదితర అంశాలను వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ ఉన్నతాధికారుల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, టిఎన్జీవో సంఘం హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు ముజీబ్ తో పాటు పలువురు విద్యార్థులు ప్రసంగించారు. అలాగే వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది కూడా వారి వారీ సమస్యలపై వినోద్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్ రజిని కాంత్, శ్రీనివాస్ యాదవ్, అమృత రెడ్డి, డాక్టర్ చీనా నాయక్, డాక్టర్ సాయికుమార్, డాక్టర్ సంపత్ తో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement