Saturday, November 23, 2024

జనాభా దామాషా ప్రకారం యాదవులకు సీట్లు కేటాయించాలి: యాదవ మహాసభ డిమాండ్

హైదరాబాద్ తూర్పు ప్రతినిధి, ఆగస్టు 25.తెలంగాణ రాష్ట్రంలో యాదవుల జనాభా ప్రకారం రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని పలు యాదవ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. యాదవుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలు స్పష్టం చేయాలని కోరాయి. అఖిల భారత యాదవ మహాసభ యాదవ విద్యావంతుల వేదిక, యాదవ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో యాదవ యుద్ధభేరి సభ పేరిట బహిరంగ సభ నిర్వహించారు

. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ యాదవ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పలు రాజకీయ పార్టీలు, యాదవ సంఘాల నేతలు, వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ మనవడు, ఢిల్లీ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ సూరజ్ మండల్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ఐక్యంగా రాజ్యాధికార సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలో అత్యధిక జనాభా గల ఏకైక కులం యాదవులదని, దేశంలో 20 శాతం ఉన్న యాదవ నాయకుడు ప్రధానమంత్రి కావాల్సిన అవసరముందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 18 శాతం జనాభా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం నామమాత్రమని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, ఐదు మందికి ఎమ్మెల్యేలను, ఒకరిని రాజ్యసభ సభ్యుడుగా చేసిందని గుర్తు చేశారు .స్థానిక సంస్థలలో అనేక మంది యాదవులకు అవకాశాలు కల్పించిందని, యాదవుల కోసం తాను పాటు పడతానని చెప్పారు. కోకాపేటలో 400 కోట్ల రూపాయల విలువైన ఐదెకరాల స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేసిందని తెలిపారు. యాదవుల హక్కుల పక్షాన నిలబడి, ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించకుందామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో యాదవుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వంలో యాదవులు భాగస్వాములు అయ్యారని తెలియచేశారు. యాదవులలో ఐక్యత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో జన్మాష్టమి, దీపావళి సదర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరారు. త్వరలో హైదరాబాద్ నగరంలో 25 లక్షల మంది యాదవులతో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చూపెట్టనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ యాదవ ఎమ్మెల్యే అభ్యర్థులు కాంగ్రెస్ ఉద్దండులను ఓడించారని గుర్తు చేశారు.

బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బీసీల లైన్ తీసుకుంటుందని, వచ్చే ఎన్నికలలో టికెట్ల కేటాయింపులో గొల్ల కురుమలతో పాటు అన్నీ బీసీ, ఎంబీసీ కులాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారంలోనే బీసీల జనగణన తెల్చుకుందామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల బీ – ఫామ్ కోసం బిక్కు బిక్కుమనే పరిస్థితి దాపురించిందని, బీసీలే బీ – ఫామ్ లు ఇచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ కురుమలు, ముదిరాజ్ , ఎంబీసీలకు ఒక్క స్థానాన్ని ఇవ్వలేదని గుర్తు చేశారు. దరఖాస్తు పెట్టి దండం పెట్టే పరిస్థితి మారాలని అభిప్రాయపడ్డారు. పార్టీలు అర్థం చేసుకోకుంటే తిరుగుబాటు చేస్తారని తెలియచేశారు. బడుగుల బాధలు బడుగులకే తెలుస్తాయని, వారే పరిష్కరించుకుంటారని చెబుతూ రాష్ట్రంలో బడుగులకు రాజ్యాధికార ఆశలు చిగురిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు విడిపోయి ఉన్నారని, “బలగం” సినిమాలో మాదిరిగా బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. యాదవులు టిక్కెట్లు సాధించుకోవడం కాదని, గెలిపించుకోవాలని కోరారు. అంబర్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను యాదవ సంఘ నేత ఆర్. లక్ష్మణ్ యాదవ్ కు ఇస్తామని, ఐక్యంగా గెలిపించుకోవాలని కోరారు.

బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడంతో పాటు అనేక రాజకీయ అవకాశాలు కల్పించిందని చెప్పారు. యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వెల్లడించారు.ఈ సందర్భంగా యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం పై యాదవ డిక్లరేషన్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాన కమిషనర్ వర్రే వెంకటేశ్వర్లు, యాదవ సంఘాల నాయకులు చింతల రవీంద్రనాథ్ యాదవ్, ఆర్. లక్ష్మణ్ యాదవ్, బలరాజ్ యాదవ్, మురళి యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, జాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement