ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి – అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం ప్రాతః కాలంన అర్చక స్వాములు సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు.సుప్రభాత సేవ అనంతరం మూడు కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గొప్రుష్ట దర్శనం చేయించారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన పురస్కరించుకొని ఆర్చక స్వాములు వేద మంత్రాలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేయి నామాలను స్తుతిస్తూ సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు.స్వర్ణగిరి శ్రీ పద్మావతి- గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ వజ్ర శోభిత స్వర్ణ ఆభరణాలతో, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణమహోత్సవాన్ని అర్చకస్వాములు అంగ రంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్నితిలకించి ఆనంద పరవశులైనారు.
స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు పురస్కరించుకొని స్వర్ణ గిరి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు దంపతులు, వారి కుమారులు మురళీకృష్ణ , గోపికృష్ణ సతీసమేతంగా స్వామివారికి మహాగణపతి అభిషేకం యాగం ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరిలో జరుగుతున్న నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 4500 మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి వైభవోత్సవ మండపంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
యాదాద్రి నర్సన్న సన్నిధిలో ఎమ్మెల్యే కుంభం
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకోని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మి నారసింహ స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే మనుమడికి అన్నప్రాసన చేయించారు. ఆలయ మర్యాదల చొప్పున అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామి వారి లడ్డు, ప్రసాదం అందజేశారు.ఎమ్మెల్యే సతీమణి కుంభం జ్యోతి రెడ్డి, కుమార్తెలు కుంభం కీర్తి రెడ్డి, స్ఫూర్తి రెడ్డి, కుమారుడు శ్రీరామ్ రెడ్డి, అల్లుళ్ళు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.