Sunday, November 3, 2024

Yadadri – కొత్త ఎనర్జీ పాలసీ తెస్తాం… ఉప ముఖ్యమంత్రి భట్టి

యాదాద్రి – యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనులను సంపూర్ణంగా 2025 మే నాటికి పూర్తి చేసి, 4 వేల మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్డు కు అనుసంధానం చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  మల్లు తెలిపారు. ఆదివారం రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లతో కలిసి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను సందర్శించారు.

రామగుండం నుంచి యాదాద్రి థర్మల్ స్టేషన్ కు బొగ్గును తరలించే రైలును వైటీపీఎస్ టేక్ ఆఫ్ దామరచర్ల పాయింట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజి-1 లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును గ్రిడ్డుకు అనుసంధానం చేస్తూ స్విచ్ ను  ఆన్ చేశారు.

వై టి పి ఎస్ పురోగతి పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్ లోని స్టేజి-1 లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును ఈరోజు గ్రిడ్డు కు అనుసంధానం చేసే కార్యక్రమం  విజయవంతంగా జరిగిందన్నారు. ఇంతకు ముందే స్టేజి-2 లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో గ్రిడ్డుకు అనుసంధానం చేసినట్టు తెలిపారు. మిగతా మూడు ప్లాంట్లు వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేసి ప్రజలకు 4వేల మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం వచ్చి దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ గత ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీని తీసుకు రాలేదని ప్రజా ప్రభుత్వం త్వరలో తీసుకువస్తుందని చెప్పారు. న్యూ ఎనర్జీ పాలసీ తయారు చేయడానికి రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యుత్తు నిష్ణాతుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి అందులో చర్చించి అందరి అభిప్రాయంతో కొత్త ఎనర్జీ పాలసీని తీసుకువస్తామని తెలిపారు.

రాష్ట్రంలో సాంప్రదాయ, సాంప్రదాయ ఇతర విద్యుత్తును పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణం కలుషితం కాకుండా  20 వేల  మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసిందని చెప్పారు.రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వస్తున్న బహుళజాతి కంపెనీలు తప్పనిసరిగా ప్రొడక్షన్ కోసం కొంత శాతం గ్రీన్ ఎనర్జీని వినియోగించాల్సి ఉంటుందన్నారు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం వారికి  విద్యుత్తు ఇబ్బందులు ఉండకుండా వారి అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసి ఇస్తామని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ 2028-29 నాటికి 22,288  మెగావాట్లు అవకాశం ఉంటుందని అంచనా ఉందన్నారు. 2034-35 నాటికి 31,809  విద్యుత్తు డిమాండ్ అవకాశం ఉంటుందని అంచనా వేసి ఉత్పాదన చేయడానికి ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమ, వ్యవసాయం, గృహ, ఇతర అవసరాలకు క్వాలిటీ పవర్ ను అందిస్తున్నామని,  భవిష్యత్తులో ఈ రంగాలకు విద్యుత్తు ఇబ్బంది రాకుండా  పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

విద్యుత్తు రంగంలో  దేశంలోనే తెలంగాణను తల మానికంగా నిలబెడతామని రోల్ మోడల్ గా చేయబోతున్నట్లు  వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు  ఎనర్జీ సెక్రెటరీ సందీప్ సుల్తానియా, స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,  నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రీపాఠీ, వై టి పి ఎస్ టెక్నికల్ డైరెక్టర్ అజయ్, వై టి పి ఎస్  ప్రాజెక్టు డైరెక్టర్ సచ్చిదానంద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement