సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అద్భుతంగా నిర్మాణం చేశారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని సతీసమేతంగా మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. సిద్దిపేట నియోజకవర్గ పక్షాన యాదాద్రి ఆలయ గోపుర బంగారు తాపడ నిర్మాణానికి కిలో బంగారాన్ని స్వామికి మంత్రి హరీష్ రావు దంపతులు సమర్పించారు. యాదాద్రి లక్ష్మీ నృసింహ ఆలయంలో మంత్రి హరీష్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దాదాపుగా పూర్తయ్యిందన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజకవర్గం నుండి ఒక కిలో బంగారం సమర్పించడం జరిగిందని, మరో కిలో బంగారం కూడా సమర్పిస్తామన్నారు. ఇప్పటి వరకు దాతల నుండి, భక్తుల నుండి దాదాపు 35 కేజీల బంగారం సమర్పించారన్నారు. మరో 45 కేజీల బంగారం దాతలు ఇతర భక్తులు ఇస్తామని చెప్పారన్నారు. బంగారు గోపురం తాపడానికి కావాల్సిన బంగారం దాతల నుండి అందుతుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా యాదాద్రి ఆలయం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మంచి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిలుస్తోందన్నారు. ఎమ్మెల్యే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ ను అడిగారని, తప్పకుండా ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..