యాద్రాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ ప్రతినిధి : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం విధ్వంసమైందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి బీఆర్ఎస్ నెట్టిందని, రైతు దీక్షలో కేటీఆర్‌ను నిలదీయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మెన్ల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ను తాకట్టు పెట్టి కొంతమంది రైతులకు రైతు బంధు వేశారని చెప్పారు. పదేళ్లగా రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వం బీఆర్ఎస్ అని, ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కాంగ్రెస్ నిర్వహిస్తున్న గ్రామ సభలకు అడ్డుతగులుతుందన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నల్గొండ లో జరిగే రైతు దీక్ష లో పదేళ్లలో రుణమాఫీ ఎందుకు చేయలేదో అని నిలదీయాలని రైతులకు పిలుపు నిచ్చారు.
ఎందుకు రైతు దీక్ష చేస్తారో చెప్పాలి
నల్లగొండ లో కేటీఆర్ ఎందుకు రైతు దీక్ష చేస్తారో చెప్పాలని… రైతులకు రుణమాఫీ , రైతుల భరోసా , సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చినందుకా అని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. రేషన్ లో దొడ్డు బియ్యం మాఫీయా ఉంది కాబట్టి ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నామని, విద్యార్థులకు హాస్టల్ లో సన్నబియ్యం తో భోజనం అందిస్తున్నామని చెప్పారు. చిల్లర రాజకీయాలతో బీఆర్ఎస్ పబ్బం గడుపుతోందన్నారు. జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని, దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మెన్ రేఖా బాబురావ్, మున్సిపల్ చైర్మెన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.