హైదరాబాద్, ఆంధ్రప్రభ: సింగపూర్‌లో ఆగస్టు 6వ తేదీన ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలను నిర్వహించనున్నట్లు WTITC తెలిపింది. ఈ మహాసభల్లో నిపుణులకు ఎక్సలెన్స్ అవార్డులు అందించనున్నారు. అట్టహాసంగా జరిగే కార్యక్రమంలో అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖుల సమక్షంలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, ఇండియా క్రెకెటర్, మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐటీ సెక్రెటరీలతో సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు
తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నోక్రాట్స్ ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు అందించేందుకు సింగపూర్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ నిర్వహిస్తున్నారు. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మహాసభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సత్తాను చాటిచెప్పనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణకు చెందిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం అవ్వనున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల పాల్గొనే కేవలం ప్రొఫెషనల్ నెట్‌వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కుతుంది.