తెలంగాణలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నం చేసుకునే బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల తహశీల్దార్ కార్యాలయం ఓ మహిళ తన కూతురితో పాటు ఆత్మహత్యాయన్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఘనాపూర్ గ్రామానికి చెందిన రాములమ్మ (38) అనే మహిళ తన కూతురితో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, స్థానికులు అడ్డుకోవడంతో .. వారు తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయించి నిరసన తెలిపారు. భర్త చనిపోతే రైతు ఆర్థిక సహాయం కింద వచ్చిన డబ్బులు డ్రా చేయనివ్వకుండా ఎమ్మార్వో శ్రీనివాస్ రావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలకి ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. ఎమ్మార్వో శ్రీనివాసరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఘనాపూర్ గ్రామానికి చెందిన దండు సాయిలు అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో 2017న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జి పెట్టుకోగా 2019లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. చెక్ రూపంలో వచ్చిన డబ్బు మృతుని భార్య రాములమ్మ, కుల్కచర్ల తహసీల్దార్ పేరిట జాయింట్ అకౌంట్‌లో జమ అయింది. వాటితో గేదెలు కొని జీవనం కొనసాగిద్దామనుకున్న బాధిత కుటుంబానికి చుక్కెదురైంది. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసేందుకు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ 2019 నుండి కళ్ళరిగేలా తిరుగుతున్నానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబ పరిస్థితి బాగోలేక, చేసేదేమీలేక తహసీల్దార్ కార్యాలయం ముందే ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు రాములమ్మ తెలిపింది.