స్నేహితులతో యువతి ఫోటోలు
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్
చేస్తామని ఇద్దరు యువకులు బ్లాక్ మెయిల్
ప్రేమించాలంటూ నిరంతర వేధింపులు
నిస్సహయస్థితిలో పురుగులు మందు తాగి బలవన్మరణం
తన మరణానికి వారే కారణమంటూ యువతి వాగ్మూలం
ఆంధ్రప్రభ స్మార్ట్ – నల్గొండ – ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు. వాళ్ల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంలో దారుణం చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రాజలింగం-రజిత కుమార్తె కొత్త కల్యాణి (19) డిగ్రీ మానేసి ఇంటి వద్దే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే యువకులు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలని లేదంటే తమతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతామని వేర్వేరుగా బెదిరింపులు దిగారు.
ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో తమ బంధువు చనిపోయారని కల్యాణి తల్లిదండ్రులు అక్కడి వెళ్లారు. సోదరుడు కాలేజీకి వెళ్లాడు. దీంతో ఒంటరిగా ఉన్న కల్యాణికి సదరు యువకుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ వేధింపులు తాళలేక కల్యాణి పురుగుల మందు తాగింది. అనంతరం తన తల్లిదండ్రులకు కాల్ చేసి విషయాన్ని చెప్పింది. అప్పటికే కల్యాణి పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన స్థానికులు మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నల్గొండ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన కల్యాణి గత రాత్రి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తన చావుకు ఇద్దరు యువకులే కారణమని చనిపోయే ముందు సదరు యువతి మరణవాంగ్మూలం ఇచ్చింది..
ఈ నేపథ్యంలోనే కల్యాణి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి, న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు కుక్కడం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. ఆసుపత్రిలోనే జడ్జితో మృతురాలి మరణ వాంగ్మూలం తీసుకున్నందున నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు తెలపటంతో నిరసన విరమించారు.