చెన్నూర్ (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర సిరొంచ తాలుకా కారసాపల్లి గ్రామానికి చెందిన రాపాక మంగళ (25) అనే మహిళ గర్భంతో తన భర్త, కుటుంబసభ్యులతో కలిసి చెన్నూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. గర్భిణిగా వచ్చిన మహిళ పాపకు జన్మనిచ్చింది.
అయితే, సేవలు అందించిన వైద్యులు పాపక్షేమంగా ఉందని తల్లి (మంగళ) పరిస్థితి ఆందోళనగా ఉందని.. ఉన్నత వైద్యం కోసం మంచిర్యాల పట్టణానికి తరలిస్తుండగా ఆమే మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. దీంతో, ఆసుపత్రి వైద్యులు సరైన చికిత్స అందివ్వకపోవడంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పూర్తి విచారణ చేపడుతామని బంధువులకి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. గర్భిణిగా వచ్చిన మహిళ పాపకు జన్మనిచ్చి ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందివ్వని కారణంగానే యువతి మృతి చెందినట్లు పేర్కొంటూ ఐ ఎఫ్ టీ నాయకులు కాసేపు ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని మంచిర్యాల ఆసుపత్రిలో పోస్టుమార్టు నిమిత్తం తరలించారు.