హైదరాబాద్ : అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసేలా టీజీఎస్పీ ని తీర్చిదిద్దుతామని డీజీపీ జితేందర్ అన్నారు. యూసఫ్ గూడలోని బెటాలియన్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నేడు నిర్వహించారు. ఇందులో 549 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపి మాట్లాడుతూ, ఇద్దరు ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు మన టీజీఎస్పీ లో చేరారని అన్నారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని తెలిపారు. వాళ్ళను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు.
పోలీస్ ట్రైనింగ్‌లో భాగంగా బాక్సింగ్, క్రికెట్ పై కూడా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నది తమ ఆశయం అని చెప్పారు.
పోలీస్ యూనిఫామ్ ధరించడం గర్వంగా ఉంది.. నిఖత్
యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న డీఎస్పీ, ఇంటర్నేషనల్ బాక్సర్ నిఖత్ జరీన్ లో మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్ యూనిఫాం ధరించడం గౌరవంగా ఉందన్నారు. ఖాకీ యూనిఫామ్ ధరించడంతో తన కల నెరవేరింది పేర్కొన్నారు.
ఇప్పటి వరకు బాక్సర్ నిఖత్ అని పిలిచే వారు.. ఇప్పుడు డీఎస్పీ నిఖత్ అని పిలుస్తున్నారని చెప్పారు. ట్రైనింగ్ పొందుతున్న కానిస్టేబుల్స్‌కి బాక్సింగ్‌లో కూడా శిక్షణ ఇవ్వాలని డీజీపీ కోరారని చెప్పారు.
తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ నుంచి కూడా ఒలింపియన్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌ను తయారు చేయొచ్చని నిఖత్ జరీన్ తెలిపారు.
ఆక్టోపస్ కమాండో ల పాసింగ్ అవుట్ పరేడ్…
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆక్టోపస్ కమాండో ల పాసింగ్ అవుట్ పరేడ్ నేడు అట్టహాసంగా నిర్వహించారు. పరేడ్ ముఖ్య అతిధిగా హాజరైన ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి కమాండోల సెల్యూట్ ను స్వీకరించి మాట్లాడారు. సైబర్ క్రైం, ఆర్థిక నేరాలు, ఉగ్రవాద నిర్మూలనకు సంవర్ధవంతంగా పని చేయాలని సూచించారు.
నేర పరిశోధనల్లో సాంకేతికతను జోడించి నేరాల ఆదుపు, నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో సత్ఫలితాలు సాధించేలా ప్రయత్నించాలన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా ఆక్టోపస్ కమాండోల ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.