Tuesday, November 26, 2024

సిద్దాపూర్ రిజర్వాయర్ తో 14వేల ఎకరాలకు సాగు నీరు.. స్పీక‌ర్ పోచారం

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణము పూర్తయితే 14వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. పనులను ఆదివారం పరిశీలించి, సమీక్ష సమావేశం నిర్వహించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు షెడ్యూల్ ప్రకారం ముమ్మరంగా జరుగుతున్నాయి.మట్టీ కట్టతో నిర్మిస్తున్నాం కాబట్టి కలకాలం పటిష్టంగా ఉంటుందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 22 లో భాగమే సిద్దాపూర్ రిజర్వాయర్ అని.. త్వరితంగా పూర్తి చేసి రైతులకు నీళ్ళు అందిస్తామని సభాపతి తెలిపారు. జూన్ 2కి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లోకి అడుగిడాం అన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడానికే ఈ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు. ఉత్సవాలు ఘనంగా పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ప్రజల స్పందన బాగుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వంగా ప్రజలు భావిస్తున్నారు.

రైతుల కష్ట‌ సుఖాలు తెలిసిన వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటున్నారు. రైతులకు అవసరమైన విద్యుత్ సరఫరా, సాగునీరు అందించడం, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడం, మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణది సక్సెస్ స్టోరీ. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అమెరికాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే గ్లోబల్ అవార్డు వచ్చింది. దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా జూన్ 7న సాగునీటి దినోత్సవం జరుగుతుంది.ఈ కార్యక్రమాన్ని సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద ఘనంగా జరుపుతాం. ఈ కార్యక్రమానికి ఆయకట్టులోని రైతులతో పాటుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని సభాపతి పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు స్థానిక రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement