Saturday, September 21, 2024

‘మన ఊరు-మన పోరు’తో జనంలోకి కాంగ్రెస్‌.. పరిగి, కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల పోరుకు సిద్ధమైంది. ‘ మన ఊరు- మన పోరు ‘ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలో భారీ సభల ఏర్పాటు దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా పరిగి అసెంబ్లి నియోజక వర్గంలో నిర్వహించగా.. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో రెండో సభను నిర్వహించారు. ఈ రెండు సభలకు స్థానిక కాంగ్రెస్‌ నాయకులు భారీ జనసమీకరణ చేయడంతో పార్టీ కేడర్‌లో నూతనొత్తేజం కనిపిస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు, కేడర్‌ను ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారు. ఈ విషయంలో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లుతున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు. దీంతో అప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడం సాధ్యం కాదని, అందుకనే ముందస్తుగా పార్టీని బలోపేతం చేయడం, శ్రేణులను అలర్ట్‌ చేయడం జరుగుతోందని పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు అభిప్రాయపడ్డారు.

టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా రాష్ట్రంలో 12 నెలల్లో ఎన్నికలు వస్తాయని, వచ్చేది సోనియమ్మ రాజ్యమే అంటూ పార్టీ కేడర్‌లో భరోసాను నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ‘ మన ఊరు- మన పోరు ‘ కార్యక్రమంతో స్థానిక సమస్యలు తెలుసుకోవడమే కాకుండా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను కూడా వివరిస్తున్నారు. ఈ సభల్లో చెబుతున్న అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చనున్నట్లు రేవంత్‌రెడ్డినే స్వయంగా వెల్లడిస్తున్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు, అమలు కానీ వాటిపైన ప్రధాన దృష్టి సారించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీపై సీఎం కేసీఆర్‌ పోరాటం చేస్తున్నట్లుగా చూపించి కాంగ్రెస్‌ పార్టీని బలహీన పర్చాలనే కుట్ర జరుగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు.

ముందుగా ఇల్లు చక్కదిద్దుకోవాలి..?
ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే.. మరో వైపు సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలనే ఆలోచనకు హస్తం నేతలు వచ్చారు. నాయకుల మధ్య సఖ్యత లేకపోతే పంజాబ్‌ మాదిరిగా తెలంగాణలో నష్టపోవడం జరుగుతుందనే భయం పట్టుకున్నది. ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని శనివారం జరిగిన టీ పీసీసీ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. సీనియర్ల మధ్య నెలకొన్ని విభేదాల కారణంగా ప్రజల విశ్వాసం పొందడం సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చారు. రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య వివాదం నడుస్తుండగా.. ఇరువురు నాయకులు భేటీ కావడం పార్టీలో మంచి పరిణామం వచ్చిందని, ఇదే ఒరవడిని మిగతా సీనియర్లతో కొనసాగిస్తే పార్టీలో నెలకొన్న పంచాయతీలన్ని సమిసిపోతాయని, తద్వారా పార్టీ కేడర్‌కు మంచి సంకేతాలు వెళ్లుతాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement