ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించిన సందర్భంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలతో సభ వేడెక్కింది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్ది లు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యల చేశారు. వివేకానంద వ్యాఖ్యల పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి తమ వాదన వినిపించడం కొనసాగించారు. దీంతో కౌశిక్ రెడ్డిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చోవాలని పదేపదే చెప్పారు. అవసరమైతే సస్పెండ్ చేస్తానని కౌశిక్‌రెడ్డికి స్పీకర్ హెచ్చరించారు. సస్పెండ్ చేయండంటూ కౌశిక్ రెడ్డి మొండిగా ప్రతిస్పందించారు. కొత్త సభ్యులకు ఇలాంటి సంప్రదాయం, ప్రవర్తన సరికాదంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ హితవు పలికారు.