తాము ఏం నేరం చేశామని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని, విభజన హామీల అమలు గురించి ప్రశ్నించడమే తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ప్రధాని పర్యటనను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కారణంగా ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు ఇవ్వాల (శుక్రవారం) ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై, ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ప్రజల మనోభావాలను అడ్డుకోలేరని, రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతాయన్నారు.
సింగరేణిలో నల్లబ్యాడ్జీలతో, రాష్ట్ర కేంద్రంలో, అన్ని జిల్లాలలో ప్రజాసంఘాల ద్వారా నిరసనలు కొనసాగాతాయి. రాష్ట్రానికి న్యాయబద్దంగా రావాల్సిన కాజీపేట కోచ్‌ప్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారందరిని విడుదల చేయకుండా ప్రధానని పర్యటన ముగిసే రేపటి వరకు జైళ్లలలో ఉంచడం అన్యాయమని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్, మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు సదాలక్ష్మితోపాటు వేలాది మంది కార్యకర్తలు, ప్రజలున్నారు.