కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్యతో దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన కామారెడ్డి మండలం బీడీ కాలనీలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తి కాసాల బ్రహ్మయ్య చారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు.
బీబీపేట మండల కేంద్రానికి చెందిన బ్రహ్మయ్య చారి గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై తరచూ భార్య నందినితో గొడవ పడుతున్నాడు. దీంతో విసిగిపోయిన నందిని, ఆమె తల్లిదండ్రులు బీడీ కాలనీకి వచ్చి బ్రహ్మయ్య చారిపై కర్రలతో దాడి చేశారు. అనంతరం నైలాన్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. హత్య చేసిన తరువాత అక్కడి నుంచి నందిని, దత్తాత్రేయ, గంగామణిలు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.