Thursday, November 21, 2024

సేంద్రియ ఉత్పత్తులకు విస్తృత ఆదరణ..మంత్రి జగదీష్ రెడ్డి

ప్రభన్యూస్,ప్రతినిధి /యాదాద్రి : సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రజల్లో విస్తృత ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మన ఉత్పత్తులు-మన గౌరవం పేరుతో నూతనంగా నిర్మించిన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను పరిశీలించారు. అనతరం మాట్లాడుతూ… మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తుల తయారీలో ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు తయారీ ఉత్పత్తుల విక్రయానికి, భవనం ఉచితంగా వినియోగించుకోవాలని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఇదొక చక్కటి అవకాశం అని చెప్పారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ప్రజలను అనారోగ్య పాలు చేస్తుందని, నేడు ప్రజల దృష్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ ఉత్పత్తులకు విస్తృత ఆదరణ లభిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సేంద్రియ ఉత్పత్తులకున్న డిమాండ్ ను ఆయన వివరించారు. చేనేత ఉత్పత్తుల కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి భవిష్యత్ మొత్తం చేనేత దే నన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుటీర, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని చెప్పారు.


జిల్లాలో రైతులు పండించే సేంద్రియ పంటలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, మెప్మా, గ్రామాల్లో తయారు చేసే అన్నిరకాల వస్తువులు కూడా ఇక్కడికి తెచ్చుకొని ఉచితంగానే స్టాల్ పెట్టుకొని అమ్ముకోవడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొరవ, మంచి ఆలోచనతో రూ.20 లక్షలతో మన ఉత్పత్తులు- మన గౌరవం పేరుతో విక్రయ శాలను నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. రైతులు, మహిళ సంఘాల సభ్యులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిసిపి రాజేష్ చంద్ర, ఆర్డీవో భూపాల్ రెడ్డి, జిల్లా అధికారులు మందడి ఉపేందర్ రెడ్డి, అనురాధ, శ్యామ్ సుందర్, అన్నపూర్ణ, టీజీవో అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, గ్రంధాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement