Saturday, November 23, 2024

రేవంత్​కు కాంగ్రెస్​ పార్టీ పగ్గాలెందుకిచ్చారు.. ఇప్పటికైనా మారిస్తేనే మంచిది: రాజగోపాల్​రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి టీ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమోచ్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా మించిపోయిందేమి లేదని, నిజమైన కాంగ్రెస్‌ వాదులకు పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్నవారికి పదవులు ఇస్తేనే పార్టీ బాగుపడుతుందని, లేదంటే కాంగ్రెస్‌ తీవ్రంగా నష్టపోతుందని కోమటిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన టీడీపీ నుంచి వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతోనే తాము సైలెంట్‌గా ఉన్నామని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడింది తమని, కొత్తగా వచ్చిన వారికి పదువులు ఇస్తే 30 ఏళ్లుగా పార్టీ నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు.

ఇప్పటికైనా మించిపోయిందేమి లేదని అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. నిజమైన కాంగ్రెస్‌ వాదులకు పదవి ఇస్తేనే కాంగ్రెస్‌ బతికి బట్ట కడుతుందన్నారు. అధ్యక్ష పదవి విషయంలో హై కమాండ్‌ ముందుగానే నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత ఏదో అభిప్రాయం తీసుకున్నట్లు యాక్ట్‌ చేశారని ఆయన విమర్శించారు. ఎల్లయ్య, మల్లయ్య అభిప్రాయం తీసుకుని నియమిస్తారా..? అని రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు. అయితే రేవంత్‌రెడ్డితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, పార్టీ బాగుపడాలన్నదే తన ఉద్దేశ్యమని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లకు పార్టీ పగ్గాలిస్తే బాగుండేదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించినట్లే ఇప్పుడు కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కొట్లాడాలన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూశాక సీఎం కేసీఆర్‌ ఆసుపత్రిలో పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement