అక్రెడిటేషన్ విధానంపై హైకోర్టు సీరియస్
జర్నలిస్టులకు గుర్తింపు కార్డుల నిరాకరణ చెల్లదు
రూల్స్‌లో కొంతభాగాన్ని కొట్టేసిన ధర్మాసనం
షెడ్యూల్ ‘ఈ’ ని కొట్టేస్తూ తాజాగా తీర్పు
రెండు నెలల్లో మార్గదర్శకాలు రూపొందించాలి
పారదర్శకంగా, హేతుబద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి సూచన
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాద్ : చిన్న పత్రికల్లో పనిచేసే జిల్లా, నియోజకవర్గ స్థాయి జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ (ప్రభుత్వ గుర్తింపు కార్డు) ఇవ్వకుండా దూరం పెట్టడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ – 2016లోని షెడ్యూల్ ‘ఈ’ ని కొట్టేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. చిన్న వార్తా పత్రికలను నాలుగు విభాగాలుగా విభజించడం సరికాదని హైకోర్టు పేర్కొంది. 2016లో జీవో 239 ద్వారా అప్పటి ప్రభుత్వం పెట్టిన నిబంధనలను సవాల్ చేస్తూ మహబూబ్‌నగర్‌కు చెందిన తాటికొండ కృష్ణ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన ధర్మాసనం..
ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న హై కోర్టు ‘చిన్నపత్రికల్లో పనిచేసే జర్నలిస్టులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా ఎందుకు విభజించారో సరైన వివరణ లేదు. తగిన వివరణ, సమర్థన లేకుండా మిగతా వారితో సమానంగా గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం చెల్లదు. రెండు నెల్లో పారదర్శక, హేతుబద్ధమైన ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందించాలి’ అని హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.