Wednesday, November 13, 2024

Bandi Sanjay | వడ్ల బోన‌స్ ఎగ్గొట్టేందుకే లేట్‌.. మిత్తీతో స‌హా కేంద్ర‌మే ఇస్తోంది

  • సుతిలి తాడుతోపాటు ర‌వాణా ఖ‌ర్చుల‌న్నీ కేంద్ర‌మే భ‌రిస్తోంది
  • వ‌డ్ల కొన‌డానికి నొప్పేం వ‌స్తోంది
  • సీఎం రేవంత్‌ను ప్ర‌శ్నించిన కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌
  • ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు?
  • ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి
  • శంకరపట్నంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప‌రిశీల‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఎగ్గొట్టెందుకు వడ్ల కొనుగోళ్లు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బ్రోకర్ల నుండి కమీషన్లు దండుకునేందుకు రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ఆయ‌న‌ ధ్వజమెత్తారు. శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద బీజేపీ నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వడ్ల పైసలన్నీ మిత్తీతోసహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. వడ్లు కొన‌డానికి నొప్పి ఏందని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ కు, ఆచరణకు పొంతనే లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా నేటికీ పూర్తిగా ప్రారంభించలేదని మండిప‌డ్డారు.

ఏం సాధించార‌ని ప్ర‌జా విజ‌యోత్స‌వాలు నిర్వ‌హిస్తారు?

ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడంపై కేంద్ర మంత్రి మండిప‌డ్డారు. ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారు? అంటూ నిల‌దీశారు. నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేసినందుకు ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి అంటూ త‌న దైన‌శైలిలో అన్నారు.

- Advertisement -

ఇదేనా రైతు ప్రభుత్వమంటే…

రైతులను అరిగోసపెట్టి దోచుకోవడమేనా కాంగ్రెస్ పాలనంటే? ఇదేనారైతు ప్ర‌భుత్వ‌మ‌ని బండి ప్రశ్నించారు. ఈ ఖరీఫ్ సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే… బహిరంగ మార్కెట్ అవసరాలకు 40 లక్షల వడ్లు పోతే, మిగిలిన 55 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు సంబంధించి పైసలన్నీ చెల్లించేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంద‌న్నారు. చివరకు వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బయట నుండి అప్పు తీసుకుంటే… ఆ డబ్బులకు మిత్తీ కూడా కేంద్రమే వడ్డీ చెల్లిస్తోంద‌ని చెప్పారు.

ఆలయాల ధ్వంసంపై….

రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేద‌ని బండి అన్నారు. మొన్ననే శంషాబాద్ హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారన్నారు . ఆ ఘటన మరవక ముందే శంషాబాద్ లోనే మళ్లీ గుడిని సల్మాన్ అనేటోడు దాడి చేశార‌న్నారు. వరుస ఘటనలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక దళాలు ఏమైనా వచ్చాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement