తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే అన్నారు. కాంగ్రెస్ హైకమండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలను ఇరికించి తన కూతురుని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయట పడేయాలని కేసీఆర్ చూశారన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు.