ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణ నూతన పోలీస్ బాస్ ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 31న డీజీపి మహేందర్‌రెడ్డి పదవీ విరమణ నేపథ్యంలో తదుపరి డీజీపి ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ సెలక్షన్ కమిటీకి పంపినట్లు తెలిసింది. సీనియార్టీ ప్రాతిపదికన ఐదుగురు ఉన్నతాధికారుల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం ఫైనలైజ్ చేసి యూపీఎస్సీకి పంపింది. వారిలోనుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ షార్ట్‌లిస్ట్ చేసి ప్రభుత్వానికి తిప్పి పంపనున్నది.
ఇందులో 1990 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత ఏసీబీ డీజీ అంజనీకుమార్, 1989బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, 1991 బ్యాచ్‌కు చెందిన హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్, అదనపు డీజీ జితేందర్, రాజీవ్ రతన్‌ల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. ఇందులోనుంచి కొత్త పోలీస్ బాస్ బాధ్యతలు ఒకరిని వరించనున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో నూతన డీజీపి ఎవరనేది ఆశక్తికరంగా మారింది.