Friday, November 22, 2024

ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నా.. సర్కారు ఆసుపత్రుల్లో మందుల కొరత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాసుపత్రులకు సరిపడా మందులను పంపిణీ చేసేందుకు బడ్జెట్‌ను కేటాయిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సర్కారు ఆసుపత్రుల్లో సకాలంలో ఔషధాలు అందక పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి టీఎస్‌ఎంఐడీసీతోపాటు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గడువు దగ్గరపడిన, త్వరగా ఎక్స్‌ పైర్‌ అయిపోయే మందులను కొనుగోలు చేయడంతో తరచూ మందుల కొరత ఏర్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో టీఎస్‌ఎంఐడీసీలో క్వాలిటీ మేనేజర్‌తోపాటు సంబంధిత ఫార్మకాలజీ విధ్యనభ్యసించిన నిపుణులు మందుల సరఫరాను పర్యవేక్షిస్తుండేవారు. ప్రస్తుతం ఈ పోస్టుల ను ఖాళీగా ఉంచారు. డీఎంఈ నేతృత్వంలోని కమిటీనే వీటిని పర్యవేక్షిస్తుండడంతో లోపాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్‌1 టెండర్ల ప్రక్రియ విధానంలో సవరణలు చేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. గడువు తీరేందుకు మూడు నెలల ముందే ఈ-ఔషధి పోర్టల్‌ అప్రమత్తం చేస్తున్నా… వాటిని తిరిగిపంపించడంలో జాప్యం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో గడువు ఎక్కువగా ఉన్న మందులను కొనుగోలు చేయాల్సిన టీఎస్‌ఎంఐడీసీ ఆ పనిచేయడం లేదని ఫార్మాసిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు కావాల్సిన మందులను తెలంగాణ రాష్ట్ర వైద్య మౌళిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) సరఫరా చేస్తోంది. మందుల సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు రాష్ట్రస్థాయిలో ఆన్‌లైన్‌ ఇండెంట్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందుకు ప్రత్యేకంగా ఈ-ఔషధి సాఫ్ట్‌ వేర్‌ను అమలులోకి తెచ్చారు. ఈ పోర్టల్‌ ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్‌ పంపిణీ, వాటి అడిటింగ్‌ జరుగుతోంది. 2015 జూన్‌ నుంచే ఈ సాఫ్ట్‌ వేర్‌ను జిల్లా కేంద్రాలతో అనుసంధానించారు. దాంతో ప్రతి ఔషధం, సర్జికల్‌ సేకరణ, సరఫరా వరకు క్షేత్రస్థాయిలో పనిచేసే మెడికల్‌ ఆఫీసర్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు అవగాహన ఏర్పడుతోంది. దీంతో మందుల కొరత రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే వీలు కలుగుతోంది.

పకడ్బంధీగా ఈ-ఔషధి పోర్టల్‌…

- Advertisement -

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఈ-ఔషధి పోర్టల్‌ను పకడ్బంధీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. గడువు తీరే మందుల వివరాలను మూడు నెలల ముందే ఆటోమెటిక్‌గా పోర్టల్‌ గుర్తించేలా ప్రత్యేక ఆప్షన్‌ను ఏర్పాటు చేయించారు. ఆసుపత్రికి వచ్చిన మందుల వివరాలతోపాటు వినియోగించిన ఔషధాల వివరాలనూ పోర్టల్‌లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల లభ్యత, స్టాక్‌ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని డ్రగ్‌ ఇన్స్‌ పెక్టర్లను ఆదేశించారు. ఈ-ఔషధి పోర్టల్‌ ను ఎలా వినియోగించాలన్న అంశంలో ప్రభుత్వ ఫార్మాసిస్టులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement