Sunday, November 24, 2024

TS | కలెక్టర్‌ అయినా.. కండక్టర్‌ అయినా ఎవరి ఉద్యోగం వారికి గొప్పదే : శ్రీనివాస్‌ గౌడ్‌

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగులు పోరాటం చేశారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని కోరారు. సమైక్య రాష్ట్రంలో కింద స్థాయి ఉద్యోగులను చిన్నచూపు చూసేవారని శ్రీనివాస్‌ గౌడ్‌ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత హోంగార్డులను కూడా గౌరవించామని చెప్పారు.

కలెక్టర్‌ అయినా.. కండక్టర్‌ అయినా ఎవరి ఉద్యోగం వారికి గొప్పదే అని స్పష్టం చేశారు. అదే సెక్రటేరియట్‌లో మళ్లీ కిందస్థాయి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కిందస్థాయి ఉద్యోగులను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భార్య, భర్త ఒకే చోట పనిచేసుకునేలా గతంలో కేసీఆర్‌ అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా అమలు చేయాలన్నారు.

ఉద్యోగుల పెండింగ్‌ బిల్స్‌ సంగతేంటి అని శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులో జిల్లాకో విధానం ఎందుకు అని ప్ర‌శ్నించారు. అన్ని జిల్లాలకు బిల్లులను సమానంగా క్లియర్‌ చేయాలని సూచించారు. రిటైర్డ్‌ ఉద్యోగులు బెనిఫిట్స్‌ రాక ఇబ్బంది పడుతున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పెన్షనర్లకు కూడా కార్పొరేట్‌ వైద్యం అందించాలని అన్నారు.

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని అన్నారు. హోంగార్డులను కూడా పర్మినెంట్‌ చేయాలని కోరారు. 250 మంది హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. ఉద్యోగులకు వెంటనే హెల్త్‌ కార్డులు ఇవ్వాలని అన్నారు. జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు ఇస్తామన్నారని.. వాటికి ఇంకా ఇవ్వడం లేదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్‌ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement