ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో ఎగిరేది కాషాయం జెండానేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. భైంసాలోని గణేష్ ఇండస్ట్రీస్ లో నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ… తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటామన్నారు. బైంసాకు భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజీపే కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణ మాత్రం అదోగతి పాలైతుందని బండి సంజయ్ ఆరోపించారు. ఒక్క సంవత్సరం లోపల పది లక్షల ఉద్యోగాలిస్తనన్న నరేంద్ర మోడీ.. ఒక్క రోజులోనే 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలిచ్చారని చెప్పారు. కేసీఆర్ మాత్రం ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించారు. ముథోల్ లో ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చినవ్, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినవ్.. ఎందుకు అభివృద్ధి చేయడం లేదని నిలదీశారు.