Tuesday, November 19, 2024

TS: తెలంగాణకు మోడీ చేసింది శూన్యం.. మంత్రి ఉత్త‌మ్

సూర్యాపేట, ప్రభ న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో పాటు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ భవిష్యత్తుకు రానున్న పార్లమెంట్ ఎన్నికలే కీలకమన్నారు. దేశంలో మోడీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య మూలాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ తిరిగి అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రతిపక్ష సీఎంలను జైల్ కి పంపుతున్నారని, దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు.

కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఎన్నికల ప్రచార ప్రక్రియకు ఇబ్బంది కలిగిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రజలను మతపరంగా విడదీసి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందన్నారు. విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫేక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదని, బయ్యారం, ఐటీఐఆర్ రద్దు చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదని, ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల అనంతరం మిగలదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంలో ఉండటంతో కాంగ్రెస్ పై అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు.

సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో పనిచేస్తున్నామని, నీటి, కరెంట్ సమస్యలు రానియ్యమన్నారు. పార్లమెంటులోనే సీఏఏ, ఎన్ఆర్సి ని వ్యతిరేకించామని, అది తమ పార్టీ విధానమన్నారు. ఈనెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఎన్నికల ప్రచార సభ కు ఖర్గే, రాహూల్ గాంధీలు హాజరు కానున్నారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిగా కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, నాయకులు అంజద్ అలీ, చకిలం రాజేశ్వర్ రావు, కేక్కిరేణి శ్రీనివాస్, గండురి రమేష్, శబరి, నరేందర్ నాయుడు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement