Tuesday, November 26, 2024

TG: కొత్త‌ న్యాయ చట్టాలపై మీ వైఖ‌రేంటి… రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు కేటీఆర్ లేఖ

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలన్నారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. నూతన చట్టాలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరమున్న‌ నేపథ్యంలో వీటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న తెలంగాణ గడ్డ పైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను యథాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా? లేక తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా? అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని సూచించారు. దీంతో పాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement