మావోయిస్టుల రాష్ట్ర బంద్
ఏజెన్సీలో రెడ్ అలర్ట్
ఐదు మండలాల్లో మూతపడిన దుకాణాలు
పోలీసుల ముమ్మర తనిఖీలు
కొనసాగుతున్న కూంబింగ్
ఆంధ్రప్రభ స్మార్ట్, వాజేడు (ములుగు జిల్లా) : ఏటూరు నాగారాం మండలం చల్పాకలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని, ఇందుకు నిరసనగా సోమవారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు వైపు మావోయిస్టులు పిలుపు, ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదివారంతో వారోత్సవాలు ముగిశాయి. వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజున బంద్‌కు పిలుపు ఇచ్చారు.
వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా జీడిపల్లిలో సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై రెండు సార్లు దాడులకు మావోయిస్టులు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని మన్యం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.
ఐదు మండలాల్లో ప్రభావం…
ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరు నాగారాం, కన్నయ్యగూడ మండల కేంద్రాల్లో బంద్ ప్రభావం కనిపించింది. దాదాపు అన్ని దుకాణాలు మూసివేశారు. ఒక్క మందుల దుకాణాలు తప్ప మిగిలిన అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు కూడా నిలిచిపోయాయి.
మన్యంలో హై అలర్ట్…
ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై సరిహద్దు ప్రాంతాల్లో రహదారులపై పోలీసు బలగాలను మోహరించారు. రాకపోకలు చేసే ప్రతి వాహనాన్ని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అలాగే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలాల నుంచి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మూడు రోజులుగా కూంబింగ్ కూడా విస్తృతంగా చేపట్టారు.