Monday, November 18, 2024

TG | ఏం సాధించార‌ని విజ‌యోత్స‌వాలు?.. ఎమ్మెల్సీ పోచంపల్లి

  • ఏడాది కాలంలో ఆరు వంద‌ల మంది రైతులు చ‌నిపోయార‌ని సంబ‌రాలా?
  • కేసీఆర్ హ‌యాంలోనే కాళోజీ క‌ళాక్షేత్రం విస్త‌ర‌ణ‌
  • కేటీఆర్ చొరవతో వస్త్ర పరిశ్రమ ఏర్పాటు
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ నేత‌లు


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, వ‌రంగ‌ల్ : ఏం సాధించార‌ని వ‌రంగ‌ల్‌లో విజ‌యోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నార‌ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమ‌వారం హ‌నుమ‌కొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరం గడవక ముందే 600 మందికి పైగా రైతులు మ‌ర‌ణించినందుకా? మహిళలపై 130 పైగా అత్యాచారాలు జరిగినందుకా? 26 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? 47 మంది విద్యార్థులు మ‌ర‌ణించినందుకా? అని ప్ర‌శ్నించారు.

మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హ‌నుమ‌కొండ జిల్లా అధ్య‌క్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ వాదులపై తుపాకులు ఎక్కుపెట్టిన వారు కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభించడం కాళోజీ గారి ఆత్మ ఘోషిస్తుంద‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే నాలుగు ఎక‌రాల విస్తీర్ణంలో కాళోజీ క‌ళా క్షేత్రం నిర్మించింద‌ని, కొత్త‌వి చేసే చేవ లేక పూర్తి కావ‌చ్చిన వాటిని వారి ఖాతాలో వేసేందుకు డ్రామాలు ఆడుతున్నార‌న్నారు. కాళోజీ పేరిట హ‌నుమ‌కొండ‌లో హెల్త్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేసిన‌ట్లు గుర్తు చేశారు.

బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలోనే కాక‌తీయ మెగా వ‌స్త్ర ప‌రిశ్ర‌మ ఏర్పాటు
పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ…బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేశామ‌ని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు చేసింది ఏమి లేద‌ని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన‌ట్లు గుర్తు చేశారు. 1350 ఎకరాల భూసేకరణ (220 ఎకరాల అస్సైన్డ్ + 1130 ఎకరాలు రైతుల నుంచి సేక‌రణ‌) జ‌రిగింద‌న్నారు.

- Advertisement -

రైతులకు ఎకరాకు 100 గజాల కేటాయింపు సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇవ్వ‌లేద‌ని చెప్పారు. లగచర్ల భూసేకరణలో 650 ఎకరాల అస్సైన్డ్ భూమి ఉంద‌ని, మిగతా 650 ఎకరాల భూ సేకరణకు ఇంత రాద్ధాంతమా అని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ , వరికి 500 బోనస్ , పంటల బీమా , రైతు భరోసా ఏ ఒక్కటి కూడా అమలు చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. మాజీ మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళల కోసం ఏమి చేశార‌ని సభ పెడుతున్నారో చెప్పాల‌న్నారు.

కాళేశ్వ‌రం వ‌ల్లే వ్య‌వ‌సాయానికి గుర్తింపు
మాజీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం వ‌ల్లే వ్యవసాయ రంగంకి ఒక గుర్తింపు వచ్చింద‌న్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ ఎస్సీ లకు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేద‌ని, మంత్రి వర్గంలో సామాజిక న్యాయం లేద‌ని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ రేపటి సభకు తాము ఏ వేషంలో ఎక్కడికి వస్తామో చూసుకో బిడ్డా అన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ… ఎంజీఎం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. రానున్న మున్సిప‌ల్‌, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చూపిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement