కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్ లో తాము పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ బిజెపి ఎంపి బండి సంజయ్ కు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా కోహెడ లోని వెంకటేశ్వర గార్డెన్ లో నేడు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యుడు ఆరుగురు పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుండి తీసేసిన వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి వీల్లేదని అంటూ ప్రజలు ఆలోచించాలన్నారు. తల్లిని నిందించి మాట్లాడిన క్రమంలో వెదవ అంటే ఆ మాటను వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు అని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు నెలల తమ పాలనలో 6 గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలన్నారు.
బండి సవాల్..
కాగా నిన్న (శనివారం) బండి సంజయ్ మాట్లాడుతూ ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నేతలు మాట తప్పారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, ఆసరా పింఛను రూ.4 వేలు, ఇల్లు లేని పేదలకు భూమి, రూ.5 లక్షలు, రుణమాఫీ, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు తదితర పథకాలు అమలు చేశారా? నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా వాటిని అమలు చేసినట్లు ఆధారాలతో సహా నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థికి కూడా ప్రచారం చేస్తానన్నారు. నిరూపించకపోతే 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి పొన్నం స్పందించారు.