Monday, November 18, 2024

Helping Hands | పేదింట చదువుల తల్లి.. గిరిజ‌న బాలిక‌ను ఆదుకుందాం రండి!

  • గుజరాత్​ రాష్ట్రం గాంధీనగర్​లో ఐఐటీ సీట్
  • అద్బుత ప్రతిభతో సాధించిన ఆదివాసి విద్యార్థిని
  • ఆదుకోవాలని ఆపన్నుల కోసం ఎదురుచూపులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, వాజేడు : అక్షర ఆణిముత్యాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కూలి పనులు చేసి రెక్కల కష్టంపై ఎలాగోలా తల్లిదండ్రులు ఆ విద్యార్థిని చ‌దివించారు. అయితే ఆమెలోని ప్ర‌తిభ ఉన్న‌త చ‌దువుల దిశ‌గా ప‌య‌నిస్తోంది. కానీ, ఆర్థిక స్థితిగ‌తులు మాత్రం అందుకు స‌హ‌క‌రించ‌డం లేదు. ఉన్నత చదువుల కోసం క‌నీసం ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఆ కుటుంబం ఉంది. ఈ క్ర‌మంలో మ‌న‌సున్న మారాజులు, దాతలు క‌రుణిస్తే కానీ ఆమె ఈ విప‌త్క‌ర స్థితి నుంచి ముందుకు సాగే ప‌రిస్థితులు లేవు. మ‌రెందుకు ఇంకా ఆల‌స్యం.. ప‌దండి ఆ స‌ర‌స్వ‌తీ పుత్రికను ఆదుకుందాం.. త‌లా ఓ చేయి వేసి మ‌న‌వంతు సాయం చేద్దాం..!!

ఏజెన్సీలో విరిసిన విద్యా కుసుమం..

ఎక్క‌డో అట‌వీ ప్రాంతం.. కొండ‌కోణ‌ల్లో ఉంటే ఆ గిరిజ‌న బాలిక చ‌దువులో మేటిగా నిలిచింది. ఏజెన్సీలో విద్యాకుసుమం విరిసింది. అయితే.. త‌మ కూతురు చదువుకు కావాల్సిన డ‌బ్బులు త‌మ వ‌ద్ద లేవ‌ని, దాతలు సహాయం చేయాల‌ని ఆ బాలిక త‌ల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మారుమూల మన్యం ప్రాంతమైన ములుగు జిల్లా, వాజేడు మండలం నాగారం గ్రామానికి చెందిన వాసం శ్రీరామ్ మూర్తి, సునీత దంపతులకు ముగ్గురు కుమార్తెలు మూడో కుమార్తె సుస్మిత ఇంట‌ర్ వరకు ప్రభుత్వ పాఠశాల, ప్ర‌భుత్వ కళాశాలలోనే చదువు సాగించింది. పట్టుదలతో చదివి గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఐఐటీలో సీటు సాధించింది.

- Advertisement -

నాలుగేండ్ల చ‌దువుకు కోసం 5 ల‌క్ష‌లు..

నాలుగేళ్ల ఐఐటీ చదువుకు క‌నీసం 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టే స్తోమత త‌మ‌కు లేద‌ని ఆ కుటుంబం ఆవేద‌న చెందుతోంది. దీంతో దాతల సహాయం కోసం ఆ బాలిక ఎదురుచూస్తోంది. ఆగస్టు 5వ తేదీన‌ గుజరాత్ రాష్ట్రం చేరుకోవాలి అంటే మూడో తేదీన‌ ప్రయాణం మొద‌లుపెట్టాల్సి ఉంటుంది. ఇక‌.. చేతిలో చిల్లిగవ్వలేక నిరుపేద చదువుల తల్లి అపన్న హ‌స్తాల‌ కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

చిన్న చిన్న సాయాలే..

ఇప్పటి వ‌ర‌కు కొంతమంది మానవతావాదులు వంద, రెండు వందలు, 500, 1000, ఇలా గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పడిన ఐటీడీఏ ద్వారా ఆ విద్యార్థిని చదువుకు ఆర్థిక సహాయం అందించి ఆ విద్యార్థిని జీవితానికి బాటలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఆ బాలికకు సాయం చేయాలనుకునే మనసున్న మారాజులు.. 93907 86082 ఈ నెంబర్​కు కాల్​ చేసి వివరాలు తెలుసుకుని ఆర్థిక సాయం చేయొచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement