హైదరాబాద్ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు చిన్నతనంలోనే పెద్ద మనస్సు చాటుకున్నారు..తన పుట్టిన రోజు సందర్బంగా కోటి రూపాయిల దాదాపు కోటి రూపాయల నిధులు సేకరించి గౌలిదొడ్డిలోని కేశవనగర్ సర్కారు బడికి జీవం పోశారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ బడిని హిమాన్షు పుట్టిన రోజు సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు. అంతకు ముందు తల్లితో కలసి పెద్దమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు..
అనంతరం కేశవనగర్ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. పబ్లిక్‌లో మాట్లాడటం ఇది ఫస్ట్ టైం. కొంచెం నర్వస్‌గా ఉన్నప్పటికీ.. నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్లుంది. ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్‌ను విజిట్ చేశాను. రాత్రి సమయాల్లో వచ్చి కూడా పనులను పర్యవేక్షించాను. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ స్కూల్‌ను మా క్లాస్ కో ఆర్డినేటర్ సూచనతో విజట్ చేశాను. అందరిలా కాకుండా.. ఎక్స్‌ట్రా ఆర్డినరీగా చేయాలనుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మనువడ్ని కదా.. ఏదైనా నార్మల్‌గా చేసే అలవాటు లేదు. స్కూల్‌కు చుట్టూ గోడలు కట్టి గేట్లు ఏర్పాటు చేయాలని మా క్లాస్ కో ఆర్డినేటర్ సూచించారు. అలా స్కూల్‌ను విజిట్ చేసిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయాం. డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలనుకున్నాం. క్లాస్ రూమ్స్‌లో తినేసరికి ఆ స్మెల్‌కి పురుగులు జమవుతున్నాయి.
తొలిసారిగా స్కూల్‌కు వచ్చినప్పుడు 10 వేల మొక్కలు నాటాం. ఈ కార్యక్రమంతో సంతృప్తి లేదు. చెట్లు పెట్టే కార్యక్రమం ఎవరైనా చేస్తారు.. మనం కొత్తగా చేయాలని చెప్పాను. స్కూల్‌కే ఒక పేరు తేవాలనుకున్నాం. క్లాస్ రికార్డులో బెంచ్ మార్క్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నాం. స్కూల్ కండీషన్ చూసిన తర్వాత ఆ బాధను మాటల్లో చెప్పుకోలేకపోయాం. కళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఆడపిల్లలకు సరైన బాత్రూమ్స్ లేకుండే. రాళ్ల మధ్యలో పిల్లలు ఆడుకుంటున్నారు. నేను వచ్చిన రోజే ఓ పిల్లాడు మెట్లపై నుంచి జారిపడి దెబ్బ తగిలించుకున్నాడు. ఆ పరిస్థితిని చూసిన తర్వాత అన్ని క్లాస్ రూమ్స్ తిరిగాం. ఫర్నీచర్‌ను పరిశీలించాం. హెడ్ మాస్టర్ రూమ్‌లోనే క్లాస్ రూం, స్టోర్ రూమ్‌ను చూసి షాకయ్యాను. ఇలా చూడడం నాకు కొత్త. మొత్తానికి రూ. 40 లక్షలు ఫండ్ వసూలు చేశాం. సీఎస్ఆర్ ఫండ్ కూడా కంట్రిబ్యూట్ చేశారు.
పేదరికాన్ని అరికట్టే ఉపాయం చదువుకున్న సమాజానికి ఉంటుందని మా తాత కెసిఆర్ ఎప్పుడూ చెప్పేవారు. నా చదువులో గ్రేడ్ తగ్గినా వంద మందికి మంచి చేసే అవకాశం ఉంటే చేయాలని నాన్న కూడా చెప్పారు. మా తాత ప్రేరణ, మా నాన్న ఆశీస్సులతో ఈ స్కూల్‌లో చాలా కార్యక్రమాలు చేశాం. ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ పేదవారు. కూలీ పనులు చేసుకునే కుటుంబాలకు చెందినవారే. ఈ స్కూల్ పిల్లల్లో ఫ్యూచర్‌లో ఇంజినీర్లను, డాక్టర్లను, లాయర్లను చూడాలి. మీలో పొలిటిషీయన్లను చూడాలి. మీరంతా చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. మా విజన్‌ను కంటిన్యూ చేయండి. భవిష్యత్‌లో కూడా తప్పకుండా అండగా ఉంటాం అని హిమాన్షు స్పష్టం చేశారు.