హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. ఆదివారం ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జా దారులను కేవలం బుసలు కొట్టి తర్వాత సైలెంట్ గా వదిలి పెట్టిందని, ప్రస్తుత కాంగ్రెస్ వారిని వెంటాడి తరుముతోందని అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను తాను పూర్తిగా సమర్తిస్తున్నాను అని తెలిపిన నారాయణ.. నాగార్జున మంచి నటుడే కావచ్చు, కాని ఇదేం కక్కుర్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఉంటే నేనే కూలుస్తాను అని సినిమా డైలాగులు కొట్టడం కాదు, ముందు చేసిన తప్పుకు నాగరార్జున సారీ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు
మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువులో కాలేజీలు నిర్మించారని వారి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయని నారాయణ అన్నారు. ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు. కబ్జాలు పాల్పడిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.
ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు జరపాలన్నారు. ఎంఐఎం నేతలవి కూడా తొలగించాలన్న నారాయణ.. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు.