దావోస్ సదస్సు కోసం వచ్చిన నేతలు
ఎయిర్ పోర్ట్ లాంజ్ లో మాటా మంతి
ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా అప్యాయ పలకరింత
జురిచ్ – స్విట్జర్ ల్యాండ్ – ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు , రేవంత్ రెడ్డి లు దావోస్ వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు నేటి ఉదయం విమానంలో స్విట్జర్లాండ్ దేశం జ్యూరిక్ చేరుకున్నారు. ఆదివారం అర్దరాత్రి ఢిల్లీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయలుదేరగా.. సింగపూర్ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జ్యూరి చ్ కు వెళ్లారు. జ్యూరిచ్ లోని హోటల్ హిల్టన్ లో నిర్వహిస్తున్న తెలుగు డయాస్పొరా మీట్ లో వీరిద్దరూ పాల్గొననున్నారు..
కాగా, సోమవారం జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో దిగిన చంద్రబాబు బృందానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం తారసపడింది. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. మంత్రుల బృందంతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఫొటోలు దిగారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు భుజంపై ఏపీ సీఎం చంద్రబాబు చేతులేసి, షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
రేవంత్, చంద్రబాబుల షెడ్యూల్ ఇదే ..
ఇక నేడు జరిగే తెలుగు డయాస్పొరా మీట్ లో స్విట్జర్లాండ్ సహా యూరప్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈఓలు, తెలుగు సంఘాలు పాల్గొనున్నాయి. స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ , చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎపి రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ , తెలంగాణ మంత్రులు దుద్దిల్ల శ్రీదర్ బాబు కూడా పాల్గొననున్నారు.. ఈ సమావేశం అనంతరం రోడ్డుమార్గాన దావోస్ కు బయలుదేరనున్నారు.. అక్కడ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలుగు ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రులు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరవుతున్నారు.