దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున వివిధ సదస్సులు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పాలుపంచుకుంటుంది. దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం తెలంగాణ రైజింగ్ కుదుర్చుకుంది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు లు మంగళవారం యూనిలీవర్ సీఈవో హీన్ షూమేకర్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎంతో పాటు దావోస్ వెళ్లిన బృందం వివరించింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ప్రవేశం ద్వారంలా ఉంటుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులతో యువతకు ఉపాధి లభిస్తుందని, అలాగే సంస్థ కూడ వృద్ధి చెందుతుందని వివరించారు.
దీనితో తెలంగాణలో యూనిలీవర్ సంస్థ వ్యాపార అవకాశాల గురించి పూర్తిగా చర్చించిన అనంతరం పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చెప్పింది. యూనిలీవర్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టినా, ఇప్పటివరకు తెలంగాణలో ఆ సంస్థ ఊసే లేదు. తొలిసారి రాష్ట్రంలో ఒకటి కాదు ఏకంగా రెండు యూనిట్స్ ఏర్పాటుకు యునిలీవర్ ఆమోదం తెలపడం విశేషం.
సీఎంతో భేటీ అనంతరం కామారెడ్డి జిల్లాలో యునిలీవర్ సంస్థ పామాయిల్ శుద్ధి యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపింది. అలాగే బాటిల్ క్యాప్ లను ఉత్పత్తి చేయడానికి కూడా కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు యునిలీవర్ సీఈవో హీన్ షూమేకర్ అంగీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్న సీఈవో హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఐటీ&ఐసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీధర్ బాబు బిజీబిజీ ..
➡️సప్లయ్ చైన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇన్నొవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ (Agility Logistics) వైఎస్ చైర్మన్ తారెక్ సుల్తాన్ గారితో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు.
➡️తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి ఈ సమావేశంలో వివరించారు.