Thursday, October 17, 2024

Loan మైక్రో మాయ! ప్రాణాలు తీస్తున్న అప్పులు

పని లేక.. చేతిలో పైసల్లేక కష్టాలు
అప్పుల ఊబిలోకి చేనేత కుటుంబాలు
ఆదాయం ప‌డిపోవ‌డంతో తీర్చ‌లేని వైనం
ఒత్తిడికి గుర‌వుతున్న‌కార్మికులు
ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఇదో కార‌ణం కూడా!
సిరిసిల్ల కార్మికుల‌ను వెంటాడుతున్న మైక్రో స‌మ‌స్య‌

అర‌కొర ఆదాయంతో కుటుంబాల‌ను నెట్టుకు రావ‌డం త‌ల‌కు మించిన భారం. అందుకే సిరిసిల్ల‌లో నేత కార్మిక కుటుంబాల మ‌హిళ‌లు బీడీ కార్మికులుగా ప‌నిచేస్తూ ఆదాయం సంపాదిస్తారు. కుటుంబ‌మంతా సంపాదించిన‌ ఆదాయంమంతా కుటుంబ పోష‌ణ‌కు మాత్ర‌మే స‌రిపోతుంది. పిల్ల‌ల విద్య‌కు… వైద్య ఖ‌ర్చులు.. పండ‌గ‌ల స‌మ‌యంలో వెచ్చించే అధిక ఖ‌ర్చుల‌కు అప్పులు చేయాల్సి వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే మైక్రో ఫైనాన్స్‌ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అలా..అప్పుల్లోకి నెట్ట‌బ‌డుతున్నారు. దీన్ని ఆస‌రాగా చేసుకొని సిరిసిల్ల‌లో మైక్రో ఫైనాన్స్ పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో బి.వై.నగర్, సుందరయ్య నగర్, పద్మ నగర్, అంబిక నగర్ శాంతినగర్ తో పాటు పలు కాలనీల్లో మైక్రో క‌ష్టాల‌ను నేత కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి.

- Advertisement -

ఆంధ్ర‌ప‌భ స్మార్ట్, సిరిసిల్ల : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభ‌వం కూరుకుపోయిన త‌ర్వాత కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఒక్క ఉపాధి అవ‌కాశాలే మాత్ర‌మే కార‌ణం కాద‌ని, మైక్రో ఫైనాన్స్‌ అప్పుల బాధలు కూడా ఒక కార‌ణం అని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామ పరిధిలోని కేసీఆర్‌ నగర్ లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ‌ని తెలుస్తోంది.

ఆర్థిక సంక్షోభ‌వంలో వ‌స్ర్త ప‌రిశ్ర‌మ‌
గత ప్రభుత్వం హ‌యాంలో నేత కార్మికుల‌కు కేసీఆర్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పని చేసే అనేక కుటుంబాలు ఇక్క‌డ నివాసిస్తున్నాయి. నేత కార్మికుల‌కు చేత‌నిండా ప‌ని ఉన్నా.. కుటుంబాల‌కు స‌రిప‌డినంతా ఆదాయం వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అందుకే మ‌హిళ‌లు కూడా బీడీలు చుట్టి ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికైనా ఆరోగ్యం బాగోలేక‌పోయినా… పిల్ల‌లను చ‌దివించాల‌న్నా వేలాది రూపాయ‌లు అవ‌స‌రం వ‌స్తుంది. అప్పులు తీసుకోవ‌డానికి త‌గిన ఆస్తులు లేక‌పోవ‌డంతో ఎలాంటి హామీ లేకుండా అప్పు ఇచ్చే సంస్థ‌ల‌ను ఆశ్ర‌యిస్తారు. అలా మైక్రో ఫైనాన్స్ వ‌ల‌లోకి నేత కార్మిక కుటుంబాలు వెళ‌తాయి.

పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చిన మైక్రో సంస్థ‌లు
కేసీఆర్ నగర్ కాలనీలో సుమారు ప‌ది వ‌ర‌కు మైక్రో ఫైనాన్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. అలాగే బి.వై.నగర్, సుందరయ్య నగర్, పద్మ నగర్, అంబిక నగర్ శాంతినగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో కూడా కంపెనీలు ఏర్పాటు చేశారు. ఒక్కో నేత కుటుంబానికి సుమారు 30 వేల నుంచి 40 వేల రూపాయ‌ల వ‌ర‌కు ఎలాంటి హామీ లేకుండా అప్పులు ఇస్తారు. వాళ్ల ఆర్థిక స్తోమ‌త బ‌ట్టీ ప్ర‌తి వారం వాయిదాల రూపంలో వ‌సూళ్లు చేస్తారు. ఒక్కో కుటుంబం ఎనిమిది వంద‌ల నుంచి 1500 రూపాయ‌ల వ‌ర‌కు, లేకుంటే ప్ర‌తి నెలా 2000 రూపాయ‌లు క‌ట్టించుకుంటారు. ఒక‌వేళ ఆ డ‌బ్బులు కూడా క‌ట్ట‌లేక‌పోతే దానికి పెనాల్టీగా వంద నుంచి రెండు వంద‌ల రూపాయ‌లు వ‌సూలు చేస్తారు. ఇందుకు మ‌హిళ ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటారు. అప్పులు ఇవ్వ‌డం… వ‌సూళ్లు చేయ‌డం… ఇవ్వ‌కుంటే ఒత్త‌ళ్లు చేయ‌డం ఇలా అన్ని బాధ్య‌త‌లు వీరికే అప్ప‌గిస్తారు.

మైక్రో ఫైనాన్స్ వాయిదా వ‌స్తోందంటే గ‌జ‌గ‌జ‌…
ప్ర‌తి వారం త‌క్కువ డ‌బ్బులు వాయిదా క‌ట్టి అప్పులు తీర్చ‌గ‌ల‌ము అనే న‌మ్మ‌కంతో నేత కార్మికులు అప్పులు వాడుతుంటారు. అలాగే ప్ర‌తి వారం గానీ, నెల గానీ వాయిదాలు కూడా స‌క్ర‌మంగా క‌డుతుంటారు. ఆదాయం లేన‌ప్పుడు వారు వాయిదాలు క‌ట్ట‌డానికి ఇబ్బందులు ప‌డుతుంటారు. ఒక ఆరు నెల‌ల వ‌ర‌కు ఆదాయం రాక‌పోతే మైక్రో ఫైనాన్స్ వాయిదా క‌ట్టాల్సివ‌స్తోందంటే కార్మిక కుటుంబాలు గ‌జ‌గ‌జ‌లాడుతాయి. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఒత్తిళ్ల‌కు గురై ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం వాయిదాలు క‌ట్ట‌లేక‌పోతున్నాం… మహేష్, కేసీఆర్‌న‌గ‌ర్‌

ప్ర‌స్తుతం కార్మికుల‌కు పైసా ఆదాయం రావడం లేదు. ఆదాయం ఉన్నప్పుడు కార్మికులు వాయిదాలు సకాలంలో చెల్లించే వారు. బీడీలు చుడుతూ మ‌హిళ‌లు కుటుంబంనెట్ట‌కు రావ‌డమే క‌ష్టంగా ఉంది. అందుకే వాయిదాలు క‌ట్ట‌డం కష్టమవుతోంది. కార్మికుల కుటుంబాలు స్థిమితపడే వ‌ర‌కూ కొంతకాలం మైక్రో ఫైనాన్స్ వారు వాయిదాలు క‌ట్టించుకోవ‌డం నిలుపు చేయాలి. లేకుంటే ఆత్మ‌హ‌త్య‌లు పెరిగే అవ‌కాశం ఉంటుంది.

కొన్ని రోజులు వాయిదాలు ఆపాలె – సత్యనారాయణ, మరమగ్గాల కార్మికుడు.
ప్ర‌స్తుతం మ‌ర‌మ‌గ్గాల ద్వారా ప‌నులు లేవు.. ఆదాయం కూడా లేదు. అప్పులు ఎగ‌వేసే అవ‌స‌రం కూడా మాకులేదు. ఇప్ప‌టి వ‌ర‌కు వాయిదాల ప్ర‌కారం అప్పులు తీరుస్తున్నాం. ఆదాయం లేక‌పోవ‌డంతో క‌ట్ట‌లేక‌పోతున్నాం. మా మీద ఒత్తిడి లేకుండా ఆరు నెల‌లయినా చెల్లింపులు వాయిదా వేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement