Thursday, November 21, 2024

TG: వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉంటాం… మంత్రి సీత‌క్క

వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉండి… ఆదుకుంటామ‌ని మంత్రి సీతక్క అన్నారు. మ‌హాబూబాబాద్ జిల్లాల్లో వ‌ర‌ద తీవ్ర‌త అధికంగా ఉన్న గ్రామాలు, తండాల‌ను మంత్రి సీత‌క్క సంద‌ర్శించారు. నిన్న అతిక‌ష్టం మీద వ‌ర‌దల్లో చిక్కుకున్న మ‌హాబూబాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క చేరుకున్నారు. మ‌హాబూబాబాద్ కు వెళ్లే అన్ని ర‌హ‌దారుల‌పైకి నీళ్లు చేరుకున్నా.. అతిక‌ష్టం మీద ప్రత్యామ్నాయ దారుల్లో మ‌హాబూబాబాద్ కు చేరుకున్న మంత్రి సీత‌క్క రాత్రి పొద్దు పోయేదాకా అధికారులతో స‌మీక్ష నిర్వహించారు. ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల నుంచే వ‌ర‌ద ప్రాంతాల‌ను మంత్రి ప‌రిశీలిస్తున్నారు. కుర‌వి మండ‌లం సీతారం నాయ‌క్ తండాను సంద‌ర్శించి బాధికుల‌కు మంత్రి సీత‌క్క భ‌రోసా ఇచ్చారు.

ఈసందర్భంగా మ‌హాబూబాబాద్ జిల్లాలో ఊహించని స్థాయిలో వ‌ర్షాలు కురిసాయన్నారు. అయితే జిల్లాలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గలేదన్నారు. మ‌హాబూబాబాద్ ప‌ట్ట‌ణంలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించిందన్నారు. చెరువుల్లో, వాగుల్లో అక్ర‌మ నిర్మాణాలు వ‌ర‌ద‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయన్నారు. ప‌ట్ట‌ణంలో వ‌ర‌ద ప్ర‌వాహానికి అడ్డుగా గ‌త ప‌దేళ్లలో ఎన్నో అక్ర‌మ నిర్మాణాలు వెలిశాయన్నారు. క‌బ్జాలు, కబ్జా దారుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో బ‌య‌ట‌పెట్టి చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.

వ‌ర‌ద‌ల్లో యువ శాస్త్ర‌వేత్త అశ్విని మ‌ర‌ణించ‌డం చాలా బాధాకరమన్నారు. ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉన్న సైంటిస్టును కోల్పోవ‌డం దుర‌దృష్టక‌రమన్నారు. ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉందని..ఎవ‌రూ అందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదన్నారు. పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుందన్నారు. వ‌ర‌ద బాధితుల‌కు నిత్య‌వస‌ర స‌రుకులు అందిస్తామన్నారు. తెగిపోయిన ర‌హ‌దారుల‌ను త్వ‌ర‌లో మ‌ర‌మ్మ‌త్తులు చేస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement