హైదరాబాద్, ఆంధ్రప్రభ : అడ్రియాల లాంగ్ వాల్ గనిలో సంభవించిన ప్రమాదంలో ఇద్దరు అదికారులతో సహా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందడం అత్యంత బాధకరమని సింగరేణి సంస్థ జీఎం సూర్యనారాయణ అన్నారు. బాధిత కుటుంబాలను సింగరేణి యాజమాన్యం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఘటనలో మృతి చెందిన ఏరియా సేప్టి ఆధికారి జయరాజు, డిప్యూటి మేనేజర్ తేజావత్ చైతన్య తేజ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీకాంత్‌లకు శనివారం సింగరేణి భవన్‌లో ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జీఎం సూర్యనారాయణ మాట్లాడుతూ దేశానికి వెలుగులు నింపేందుకు సింగరేణి ఉద్యోగులు, అధికారులు అత్యంత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను ఫణంగా పెడుతూ బోగ్గును వెలికి తీస్తున్నారని పేర్కొన్నారు.
అడ్రియాల ఘటనలో అనుభవజ్ణుడైన అధికారి , ఉజ్వల భవిష్యత్ ఉన్న మైనింగ్ ఇంజినీర్‌తో పాటు ఉపాది కోసం పనిలో చేరిన ఒక యువకుడిని కోల్పోవడం అందరిని కలిచివేసిందన్నారు. గనిలో రక్షణ చర్యల కోసం ముందస్తుగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకున్నదని వివరించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించడం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది 40 గంటల పాటు ఆపరేషన్ ఏసి గనిలో చిక్కుకుపోయిన ఆరుగురిలో ముగ్గురి ప్రాణాలు కాపాడారని , మిగతా ముగ్గురిని రక్షించేందుకు చివరి వరకు ప్రయత్నించారన్నారు. ఈ కార్యక్రమంలో బొగ్గు గని అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రావు, జీఎంలు రవి శంకర్, సురేందర్, మేనేజర్ భాస్కర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.