ఓదెల, మార్చి 21 (ప్రభ న్యూస్): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని బీమారపల్లి గ్రామంలో అకాల వర్షాలతో నేలమట్టమైన మొక్కజొన్న పంటను ఆయన ఎమ్మెల్యే దాసరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి నివేదికలు అందించాలని చెప్పారన్నారు.
నష్టపోయిన పంటల అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించి, ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎలాంటి అధైర్యపడవద్దని, సీఎం కేసీఆర్ ప్రతి రైతుకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీపీ రేణుకాదేవి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు కావటి రాజు, నాయకులు ఆకుల మహేందర్, మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, బోడకుంట చిన్న స్వామితో పాటు ఏఓ నాగార్జున, రైతులు పాల్గొన్నారు.