తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం
గెలుపునకు పొంగిపోవడం… ఓడితే కుంగిపోవడం ఉండదు
24ఏళ్ల పాటు అండగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు
తెలంగాణ అమరవీరులకు జోహార్లు
పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ సందేశం
హైదరాబాద్ – బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంట పట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు, కార్యకర్తలందరికీ.. తమకు మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలన్నారు. విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కృంగిపోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటామన్నారు.
రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, మళ్ళీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని తమ ఉద్యమ నేత, కేసీఆర్ పార్టీని జలదృష్యంలో ఏర్పాటు చేసారన్నారు. ఎన్నో పోరాటాలతో లక్ష్యంతో తెలంగాణ సిద్ధించిందన్నారు. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేశారన్నారు. కుట్రలు ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూసారని తెలిపారు.
కేసీఆర్ పై తెలంగాణ ప్రజలకు మమకారం ఎక్కువ…
కేసీఆర్ నాయకత్వంలోనే 2014లో అధికారం చేపట్టి సమస్యల పరిష్కారం కోసం పార్టీ, ప్రభుత్వం రెండు పని చేశాయన్నారు. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో మహారాష్ట్రలో కూడా పార్టీ విస్తరించిందని తెలిపారు. కానీ దురదృష్టవశాత్తూ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యమన్నారు. కానీ కేసీఆర్ మీద నమ్మకం ఉంది కేసీఆర్ ను తెలంగాణ కోరుకుంటుందన్నారు. ఎవరెన్ని కించపర్చినా తాము కుంగిపోమన్నారు. 24 ఏళ్ళలో తమకు ఇచ్చిన గౌరవం అభిమానానికి ధన్యవాదాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసన్నారు.
జయశంకర్ సారూ మాటలే స్ఫూర్తిగా..
“తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం… తెలంగాణ కంటూ ఉన్న ఒక ఇంటి పార్టీ టీఆర్ఎస్… తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష” అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు, ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాది మంది తెలంగాణ అమర వీరులకు పేరుపేరునా ధన్యవాదాలన్నారు. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటామన్నారు. కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతామన్నారు.