హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుపై శాసనసభలో సోమవారం సభ్యులు బల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వానాకాలంలో 2.20 లక్షల ఎకరాలకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు నిమిత్తమై 10 లక్షల 90 వేల ఎకరాలను అనువైన ప్రాంతంగా సూచించిందని తెలిపారు. పంట మార్పిడి విధానంలో భాగంగా భారీ స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్స#హస్తున్నామని చెప్పారు. కేంద్రం సూచించిన దానితో పాటు అదనంగా 20 లక్షల ఎకరాల్లో ఈ సాగును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ నర్సరీలు, ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయిల్ పామ్ సాగు నిమిత్తం రైతుల్లో చైతన్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
డ్రిప్ ఇరిగేషన్‌కు కేంద్రం రూ.6 వేలు మాత్రమే ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.14 వేలకు పైగా భారం పడుతోందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఎక్కువ సాగు చేసే వారికి రాయితీపై ఆలోచిస్తామన్నారు. అయిల్ ఫాం మొక్కలు 14 నుంచి 16 నెలల వయసున్న మొక్కలను రైతులకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రైతులు ఒక్కో మొక్కకు రూ. 17 చెల్లించాలన్నారు. నాలుగు పంటల అనంతరం పంట దిగుబడి మొదలవుతుందని, అయిల్‌ఫాం పంటలో అంతర్ పంటలను వరి తప్ప మిగతా వాటిని పండించేందుకు వీలుందన్నారు. ఆయిల్ ఫాం సాగుపై రైతులలో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు రైతులతో టూర్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..